Posts

Showing posts with the label కవితలు
Image
కొన్ని పాత్రలంతే కాలానికి కళ్లాలేసి మనసుల్ని కదిలిస్తాయ్.. గతపు గదిలోకెళ్ళి చూస్తే కాలమాగిపోయిన గుర్తుల్ని చూపించేస్తాయ్.. మది మౌనమైనప్పుడల్లా స్నేహపు చప్పుళ్లను చేస్తుంటాయ్..! మరపంటూ లేని జ్ఞాపకాల్ని.. మరోసారి గుర్తుచేస్తాయ్..!! నీతో గడిపిన కాలం కొంతే ఐనా.. గతపు పేజీలు నీవే కొన్నైనా..!!! -అనామిక
ఆ కళ్లేదో మాయ చేసాయ్... కలలో కనిపించి మాయమైపోయిన అద్భుతం లా... కళ్ల ముందే తచ్చాడుతుంటాయ్... కనుచూపుమేరంతా శూన్యమైనా..! -అనామిక
ఉదయాలెంత బాగుంటయో... రేరాజు వీడ్కోలు పలకలేక.... మేఘాలతో నిశ్శబ్ధ గీతాలాలపిస్తుంటే... చెలికాడిని వీడలేక... మబ్బులన్ని తమలో కలిపేసుకుంటుంటే.... సూరీడొచ్చేస్తుంటాడు.. చీకటి తాలూకు స్నేహాన్ని తన వెలుగుతూ కప్పేస్తూ... రేయంతా మెరిసిన తారలకి విరామాన్నిచ్చేస్తుంటాడు... పగలుని పరిగెత్తించ్చేస్తాడు... ఈరోజు నీదన్న కొత్త ఆశనొకదాన్ని నూరిపోస్తూ... రేయి...పగలు... ఒకదాని వెంటొకటి... ఒకదాని కోసమొకటి... తరాలు గడిచినా యుగాలు మారినా... చెక్కు చెదరని స్నేహమది... అంబరం లో దాగిన అనుబంధమది...!!! _అనామిక
ఆశలన్నీ గుర్తొస్తున్నాయి.. అడియాసలయ్యాక... జ్ఞాపకాలు సంకెళ్లవుతున్నాయి.. బంధాలు ముందరి కాళ్లకి కళ్లేలయ్యాక.. -అనామిక 

ఆశ

చావే లేని ఆశ.. చంపడానికొచ్చిన నిరాశని చంపేస్తుంది..!! సూర్యోదయానికి నిలువెత్తు ప్రతిరూపం ఆశ.. ఎన్ని అస్తమయాలొచ్చినా అలుపే రాని శ్వాస..!! మనసు గదికి సంకెళ్లు లేని బందీ ఆశ.. నిరంతరం ధైర్యాన్ని తోడిపోసే వృత్తి లో జీవిత ఖైదు..!! ఊపిరాగేదాకా ఊసుపోనిది ఆశకొక్కదానికే.. ఊడిపడ్డప్పుడల్లా ఊరడించి ఊపందిస్తుంది....!! ఆశలన్ని కట్ట కట్టుకుని ఆశయాలైపోయాయి.. ఆవిరైపోయిన జీవితాల్లో వెలుగు నింపాలని..!! ప్రతి కలానికీ ఓ ఆశ.. తన యజమాని ఊహలన్నిటికీ పురుడు పోయాలని..!! -అనామిక
ఏ నిశిరాతిరి శబ్దానివో.. గుండె లయ కి శృతి కలుపుతుంటావు.. ఏ స్మృతి గీత మౌనానివో.. మదికో కొత్త భాష నేర్పిస్తుంటావు.. ఏ పరుష భావాధిపతివో.. దరి చేరలేక దూరం చేస్తుంటావు..!! -అనామిక 

ఆడపిల్ల

Image
చంద్రుడు తన పని తాను చేసుకుంటూ పోతుంటే... ఆరు బయట పిల్లగాలి తోడై నవ్వుతుంటే.... గుమ్మం లో కూర్చుని బుగ్గ మీద చేయి ఆనించి కూర్చునే ఆడపిల్ల కన్నా అందం ఏముంటుందో ఈలోకం లో...!!! కనురెప్పలు కలిసే ఆడిస్తున్నా కలవలేని కలువపూల కనులు ఆనంద ఆశ్చర్యాలతో ముంచెత్తుతున్నా, చిరునవ్వులొలికే అలిసిపోని అధరాలు.. కాదేదీ కవిత్వానికనర్హం అన్నట్లు, అందాన్ని వర్ణించడానికి అక్షరాలు ఏవైతే ఏమిటిలే...!! మది పూల తోటలో పూచే భావాల అక్షరాలన్నీ దండ పేర్చి కవితా దేవత కి అర్పించాలనుకుంటే..... ఎక్కడి నుంచి వచ్చాయో మరి ఊహల మురళీ గానాలు... నన్నే మరిచేలా మైమరిపించేలా...!! అయినా, ఆడపిల్ల ఊహల కన్నా అద్బుత సృష్టి ఏముంటుంది... ఏ మౌని బ్రహ్మకి భూలోకంలో పూజలుండవని శాపమిచ్చాడోగానీ.... కరడుగట్టిన రాళ్లు రప్పలు ఉన్న సృష్టి లో, అమాయకత్వానికి అందాన్ని ఇచ్చి ఆడపిల్లని సృష్టించిన బ్రహ్మ ని మెచ్చుకోక తప్పదు...!!!!!! -అనామిక